॥ గజిబిజినీ ॥

Standard

ఉన్నట్టుండి రాంబాబుకి సినిమాల్లో హీరో అయిపోవాలని కోరిక పుట్టింది. అయినా నిన్ను పెట్టి ఎవడ్రా సినిమా తీసేది తల మాసిన వెధవ? అనడిగితే.. తల మాయడానికి చాన్సులేని వాడే ఘోస్ట్ ప్రొడ్యూసర్ ‘సత్య నాదెళ్ళ’ అని చెప్పాడు. అవునా ఆయన్నేలా ఒప్పించావురా అంటే.. “చాలా సింపుల్ నా కధ ‘గజినీ’కి రీమేక్ ‘గజిబిజినీ’. అది ‘భీభత్స’రస ప్రధానం, మనది ‘హాస్య’రసభరితం. దానిలో గజినీ పచ్చబొట్టుతో ఒళ్ళంతా పేర్ల ముగ్గులేసుకుంటాడు. మనదాంట్లో అలాంటి చాదస్తానికి చాన్సులేదు. మనదంతా మోడ్రన్.. టెక్నాలజీ బేస్డ్. ఇందులో హీరో విండోస్ 10 ఫోనులో కోర్టాన సహాయంతో తన దైనందిన ప్రణాలికలు అమలుచేస్తుంటాడు.” ఇప్పుడర్థమయింది సత్య నాదెళ్ళ ఎందుకు ఫైనాన్స్ చేస్తున్నాడో వీడి సినిమాకి. ఇంతకీ నాదెళ్ళకి చెప్పి ఒప్పించిన లైన్స్ ఏంటి?

ghajini3

        సినిమా ఓపెనింగ్ సీన్ లో హీరో ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా బోర్లా(సెన్సారు వారి యోగ క్షేమాలదృష్ట్యా) పడుకుని ఉంటాడు. మెడలో ఒక స్ట్రాప్ కి Microsoft Lumia 950 XL ఫోన్ వీపుపై మోగటానికి సిద్దంగా అప్పుడే డిస్ప్లే నీలం రంగులోకి మారుతుంది. మరుక్షణంలో… కోర్టానా: “గుడ్ మార్నింగ్ గజిబిజినీ.. నీ పైత్యానికి తెల్లవారింది. గుడ్ మార్నింగ్ గజిబిజినీ.. నీ పైత్యానికిక తెల్లవారింది.” అని లూప్ లో మోగుతుంటుంది. కొన్ని పాక్షికంగా బ్లర్డ్ ఫ్రేమ్స్ తరువాత గజిబిజినీ ఫోన్ ని చేతిలోకి తీసుకుని..
హాయ్.. కోర్టానా
హాయ్ చీఫ్.. గుడ్ మార్నింగ్.. ఆస్క్ మీ ఎ క్వశ్చన్
నేనెవరు.. నా పేరేంటి?
నీ పేరు ‘గజిబిజినీ
నేనెక్కడున్నాను?
పగలో
నాకేమైంది? నాకేంటీ ఖర్మ?
నీ ఖర్మ కాలింది. దానికెవరో అకారణంగా నిప్పంటించారు.
ఈ నాలుగు లైన్లు విని బ్లాంకు చెక్కు మీద తన సంతకం చెక్కి సినిమా హిట్టయ్యాక కనిపించమన్నాడట ‘నాదెళ్ళ’. నా వంతు ఉడతాసాయంగా నీకు ఓపెనింగ్ స్లైడు చేసిస్తానని క్రింది స్లైడు చేసిస్తున్నా…
కథ, కథనం, సైగలు, మాటలు, పాటలు, పాట్లు, దర్శకుడు, ప్రేక్షకుడు, *.*

రామ్ బాబు (మలి పరిచయం)

॥ ఇస్తిరయ్యా వాయనం.. పుచ్చుకుంటిరయ్యా వాయనం ॥

Standard

12801367_971100576310447_5318980875656666114_n

పెద్ద చదువులు చదువుకునే రోజుల్లో పుస్తకాలపైన పూర్తి పేరు రాయకుండా ఒక్క ‘U’ మాత్రం రకరకాల ఆకారాల్లో రాసుకునేవాడ్ని. పెద్ద చదువులంటే.. పేద్ద చదువులని కాదు, కాకపొతే చిన్నవాటికంటే కొంచెం పెద్దవన్నమాట. పుస్తకాల్లో అంతంత పొడవున పేర్లు రాయడం, అంతకన్నా పొడవుగా అండర్లైన్లు గీయడం, రంగురంగుల స్కెచ్చులతొ హైలైట్ చేయడం పుస్తకాలకుండే మానం, అభిమానం లాంటివి భంగం చేయడమేమోనని నా అభిప్రాయం. ఏఁ.. ఆమ్లెట్లో గుడ్డుపెంకులు లేక ఖర్జూరంలో ఇసుక తగిలినట్లుందా? వాక్కే.. బీరుకొచ్చి గ్లాసు దాయడమెందుకు అసలు విషయానికొచ్చేస్తా. వాస్తవమేంటంటే పాపం నా పుస్తకాలు చాలా మంచివి, మనసున్నవి. సెమిస్టరవ్వగానే ఓ వందో రెండొందలో చేతిలో పెడితే బస్సెక్కి పుట్టింటికెళ్ళి(కోఠీ), తరువాతి సెమిస్టరు పుస్తకాలని పంపించేవి. పిచ్చిగీతల్లాంటి చెత్త పనులుగానీ చెస్తే అలిగి చిత్తు కాగితాల కొట్టుకెళ్ళిపోయేవి పర్మనెంటుగా. ఇంతకీ ఇంత ఉపోద్ఘాతమెందుకు ఎందుకిచ్చానంటే? ఒకసారి నాపేరులో ‘U’ తప్ప మిగతా అక్షరాలన్నీ దాడికొచ్చాయ్.. కలలో. వాటి జెండా, ఎజెండా ఏంటంటే వాటిని పూర్తిగా నల్లపూసలు చెసేశానని. వాటికి న్యాయం చేయకపోతే నిద్రపోనివ్వమని ఘెరావ్ చేశాయ్. మీలో అందరికి కాకపోయినా కొందరికైనా సందర్భాన్ని బట్టి తప్పకుండా న్యాయం చేస్తానని మాటిచ్చాకకానీ నన్ను నిద్రపోనివ్వలేదు. వాటికిచ్చిన మాట నిలబెట్టుకుందామని రాగిణిని పెళ్లిచేసుకుని ‘R’కి సగం సీటిచ్చేశా(హృదయ సింహాసనంలో). నార్వే వచ్చి ‘N’కి నా చరిత్రలో కొన్ని పేజీలిచ్చా (చించి కాదు). పార్థు పుట్టాక ‘P’ని ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా. నీళ్ళలో ఈతకొట్టడం రాకపోయినా భవసాగరాలు ఈదే పనిలో పడి మిగిలిన అక్షరాల మాట నిజంగా మర్చిపోయా. ఇంకేముంది ఈ సారి నాపేరులో లేని అక్షారాలు కూడా నామీద దాడికోచ్చాయి మా పరిస్థితేంటని.. మళ్ళీ కలలోనే. జిజ్ఞాస్ పుట్టాక నా పేరులో లేని అక్షరాల కోటాలోంచి ‘J’ని ఎత్తి రాగిణి ఒళ్ళో కూర్చోబెట్టా. ఇక ముందు ముందు దాడికి దిగినా, నాపై యుద్ధం ప్రకటించినా అందరికీ న్యాయంచేసే శారీరిక, మానసిక, ఆర్ధిక, సామాజిక ఇలా ఏరక-మైన ఓపికలు లేవని గెట్టిగా చెప్పేస్తా.. ఆ.. అంతే.
అలాగే మన జంబూ ద్వీపంలో కూడా పాపం వీళ్ళకసలు నోరులేదని కొందరికి, ఉండి అరిచినా వినిపించేటంత సంఖ్య లేరని కొందరికి, అరిచారని కొందరికి, అరాచకించారని ఇంకొందరికి అలా ఇచ్చుకుపోతున్నారు. ఇస్తిరయ్యా వాయనం.. పుచ్చుకుంటిరయ్యా వాయనం. వాయనం ఎంటో తెలియని వాళ్ళుంటే చెప్పండి?

తను ‘వెచ్చ’నంటా..

Standard

12742166_959419917478513_5281527846635905050_n

“పూలనే… కునుకేయమంటా…
తను ‘వచ్చె’నంటా.. తను వచ్చె’వెంటా’
తను ‘వెచ్చ’నంటా..
తను’విచ్చె’నంటా.. ‘తనువిచ్చె’నంటా.. “

        ఇలా కలలో ఒక అబలని ఎడా పెడా ఇబ్బందిపెట్టే పనిలో బిజీగా బిజీగా ఉండగా నిజంగానే రాంబాబుకి లుంగీలో తనువంతా వెచ్చగా స్పృశించసాగింది. లేచి చూసుకుంటే.. కంగారు పడవలసినంత విషయమేమీ కాదు. డైపర్ మానేయడం అలవాటు చేసుకుంటున్న వాళ్ళ చంటోడు ఎప్పుడొచ్చి పడుకున్నాడో తన బొజ్జమీద.. వెధవకి ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునే అలవాటు.. వాడికి తెల్లవారింది అంతే.

        తడిచింది లంగా కాదు లుంగీ, వెళ్లి వాడికి మార్చి మీరూ మార్చుకురండి ‘లుంగీ’ – అంది చాలా క్లియర్ వాయిస్ లో A.కాంతం. చలికాలం అందునా చలిదేశంలో బావ బావమరిది సినిమాలో సిల్కు వాయిస్లా ఉండాల్సిన కాంతం వాయిస్ భారతనారి సినిమాలో విజయశాంతికి డబ్బింగ్ చెప్పిన సరిత వాయిస్లా ఉండేప్పటికి, చర్చలకిది సరైన సమయం కాదని గ్రహించి తక్షణమే కార్యోన్ముఖు’డై’య్యాడు.

॥ ఆజన్మ వైరం ॥

Standard

bleeding_toe

నా చిన్నప్పుడు నా కాళ్ళ బొటన వేళ్ళకి మా ఇంటి గడపలకి బొత్తిగా పడేది కాదు. అస్తమానం కొట్లాటే.
అప్పటికీ మా నాన్న చెబుతూనే ఉండేవాడు లోపలిగుమ్మాలే కదా అరంగుళం చాలురా అని. అయినా వినిపించుకోకుండా ఆరంగుళాలు పెట్టేశాడు ఆ అర’వం’డ్రంగి.
ఒకసారి ఇలాగే ఒక పెద్ద కొట్లాటయింది వాళ్ళిద్దరికీ. గుమ్మానికి పెద్దగా దెబ్బలేమీ తగలలేదు కానీ నా కుడికాలు బొటనవేలుకి మాత్రం పుచ్చలేచిపోయింది, అక్కడికక్కడే రక్తం కక్కేసింది.
మా అమ్మ అప్పటికీ సాంప్రదాయబద్ధంగా నిండా పసుపు రాసి ముత్తైదువులా అలంకరిస్తానన్నా మా నాన్నే వినకుండా దాన్ని ఆసుపత్రిపాలు చేసి తెల్ల బట్టలు కట్టించి విధవని చేసిమరీ ఇంటికి తెచ్చాడు. దాని భాధ చూడలేక నేనూ దానితో కన్నీళ్ళతోపాటు మధ్య మధ్యలో ఎక్కిళ్ళు కూడా పెట్టుకున్నాను. అలా మేమిద్దరం కలిసి మెలిసి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి, ఎందుకంటే అందరం ఒకే ప్రాణంగా బ్రతికేవాళ్ళం.

॥ గొబ్బెమ్మలతో సెల్ఫీ ॥

Standard

Bhogi-images-download

ఒరేయ్ రాంబాబూ… మరీ పైత్యం కాకపోతే భోగిమంటలతో సెల్ఫీ ఏంటిరా నీ పాసుగాల. 

ఆ వెనుక అమ్మాయెవర్రా.. జుట్టు అంటుకుంటుందేమో జాగ్రత్త అని చెప్పు, తల ఆరబెట్టుకోవడానికి భోగిమంటల్లో సెల్ఫీ తీయించుకోవక్కర్లేదు. తల ఆరబెట్టుకోవడానికి తగలబెట్టుకొవటానికి తేడా ఉందని చెప్పరా బాబూ.

ఆ ముందు వరసలో ఆ గొబ్బెమ్మపాణి ఎవడ్రా.. ఎంతమాత్రం ఆర్టిఫీషియల్ ఆవు పేడ అయితే మాత్రం గొబ్బెమ్మలతో సెల్ఫీ ఏంటిరా.. మా ఖర్మ కాకపోతే.

అయినా ఆ ఫొటో ఫేస్బుక్లో పెట్టేదాకా బతికున్నావ్ అదే సంతోషం. 

‘ఫేస్బుక్కు + సెల్ఫీ’ ఒక డెడ్లీ కాంబినేషన్ అనే విషయం ఇవాళ మరోసారి ఋజువయింది.

ఈ సృష్టిలో అణుబాంబు తరువాత మనిషి కనుక్కున్న అతిప్రమాదకరమైన విషయం ఈ సెల్ఫీనే.. అనిపిస్తుంది కొన్ని ఫొటోలని చూస్తుంటే. 

సరిసర్లే.. ఆందరికి భోగి పండుగ శుభాకాంక్షలని చెప్పు 

 

వలస చీమలు, The Expa(n)ts

Standard

ఏఁవండీ.. ఏంటీ మన పైవాటాలోకి ఎవరో ఒక కొత్త జంట దిగినట్టున్నారు? ఒకటే ఇకఇకలు పకపకలు.” 
ఇవి మాఆవిడ మాటలు కాదండీ బాబు. మా రాంబాబుగాడి స్టోర్ రూంలో పల్లీడబ్బాలో గత 6 నెలలుగా కాపురముంటున్న ఒక చీమల జంట మాటలు. వాటి పై షెల్ఫ్ లో కొత్తగా దిగిన జంటకూడా చీమలే. అప్పుడే వీకెండ్ పార్టీనుండి తిరిగొచ్చిన కొత్త జంట ఇకపకల సంభాషణ సారాంశం ఇదే.


.చీ.:- ఏఁవోయ్.. ఏంటీ ఇది మన ఇడ్లీరవ్వేనా..? ఇంత తియ్యగా ఉంది?

.చీ.:- ఏఁవండోయ్.. బై లక్ మనం దారి తప్పి పక్క షెల్ఫ్ లో ఉన్న పంచదార డబ్బాలోకి వచ్చి చేరాం.. కేవలం నువ్వు.. నేను.. అయ్యబాబోయ్.. ఐ యాం ఎక్సైటేడ్.

.చీ.:- అదేంటీ మనం ఇండియా నుంచి వచ్చింది ఇడ్లీ రవ్వలో కదా? ఈ దరిద్రుడు ఇండియా నుంచి చివరికి పంచదార కూడా తెచ్చుకుంటున్నాడా? అలా అని తెలిస్తే మా బామ్మర్దిగాడ్ని కూడా వెంటపెట్టుకొద్దునుగదా.. ఖర్మ.

.చీ.:-  ఈ పంచదార చూడబోతే సుగర్ బీట్స్ నుంచి తీసినట్టున్నారు. కాబట్టి ఇండియా నుంచి తేవడానికి చాన్స్ లేదు. మీరు ప్రతిదానికీ అలా అనుమానించకండి పాపం రాంబాబు గారిని.

.చీ.:- అన్నట్టు నిన్న జాగింకెళ్ళొస్తుంటే కింద పోర్షన్(పల్లీ డబ్బా)లో ఎవరో మనలాగే Expats ఉన్నట్టున్నారు, పలకరించావా?

.చీ.:- వాళ్ళదీ మన భాషే కానీ యాస వేరు.


.చీ.:- ప్రపంచమంతా గ్లోబలైజేషన్ పాట పాడుతుంటే, ఏడు సముద్రాలు దాటొచ్చినా నువ్వింకా భాష, యాస పట్టుకుని వేళ్ళాడుతుంటే ఇహ మనకి పంచదార కాదు ఇసుకదార కూడా దొరకదు జాగ్రత్త

॥ ఒలావ్ – పలావ్ ॥

Standard

      సరిగ్గా 20 ఏళ్ళక్రితం ఇలాగే నార్వేలో జనం దాదాపుగా మంచురహిత క్రిస్మస్ జరుపుకుంటున్న రోజులవి. చరిత్రకారులు చరిత్రని పుస్తకాల్లో రాయడం మానేసి వికీపీడియాల్లో నమోదు చేయడం మొదలుపెడుతున్న రోజులు కూడా అవే. అలాంటి రోజుల్లో ఒకరోజు క్రిస్మస్ పార్టీ నుంచి అప్పుడే బయట పడ్డాడు ‘తూరా’. అందరూ పీకలదాకా తాగుతుంటే మనవాడు రెండు పింట్లు ఎక్కువగా అంటే కళ్ళు మునిగే దాకా(మత్తులో) తాగాడు. మగువల తెగువలు తగవులకి దారితీస్తుంటే తగని వాడినని తెలుసుకుని జాకెట్టు, వాలెట్టు కూడా మర్చిపోయి కేవలం శీలంతో బయట పడ్డాడు మన అభినవ నార్వే రాముడు ‘తూరా’. అవును మనవాడు నిజంగా తూ’రాముడే. సీత మనసుతో పాటు జనకుడిని కూడా దోచుకున్నాడు. ఛ..ఛ.. మీరనుకుంటున్నట్టు కట్నకానుకలతో కాదండి. జనకుడి’ది’ (కూడా మనసే) అనబోయి అలా అచ్చుతప్పు. కావాలంటే రెండు వాక్యాలు వెనక్కెళ్ళండి. సో.. అలా తెల్లవారుఝామున 3 గంటలకు వీధిన పడ్డ మన తూరాముడికి హనుమంతుడిలా తారసపడ్డాడు ‘షఫీ’యుద్దీన్. షఫీ పాకిస్తానీయుడు. పొరుగు దేశంలో అంతా సాఫ్టు’వేరు’ పట్టుకుని దేశాలుపడుతుంటే మేము వేర్వేరు అంటూ డ్రై’వేరై’ నార్వే పట్టాడు. అప్పుడప్పుడే నార్వేలో పూసిన ఆయిల్ పూల సువాసన పాకిస్తానీయులు ఆఘ్రాణం చేసుకుంటున్న రోజులవి. ఏది వేరు ఏది చెట్టు ఐతేనేం ‘షఫీ’ అల్లా పెంచిన వెన్నెల తోటలో మనసు చెట్టుకు పూసిన మల్లె పూవు లాంటి తెల్లని మనసున్నవాడు. మన తూరాకి తన జాకెట్టిచ్చి ఇంటి దగ్గర దింపి తన ఇంటికెళ్ళి కారు 3 సార్లు కడుక్కుని కూడా ఒక్క ఓరె కూడా అదనంగా చార్జ్ చెయ్యలేదు. 3 రోజుల తరువాత మన తూరాముడు యోగనిద్ర నుండి బయటపడ్డాడు. గతజన్మ రహస్యం తెలుసుకున్న తమిళ హీరోలా వెంటనే షఫీకి ఫోన్ చేసి యాదోం కి బారాత్ టైటిల్ సాంగ్ bgm తో క్షమాపణలు చెప్పి, కష్టనష్టాలు అడిగి, పడవ ప్రమాదంలో చిన్నప్పుడు తప్పిపోయిన తమ్ముడిలా ఫీల్ అయి సకుటుంబ సపరివార సమేతంగా ఒకసారి మీరంతా మాఇంట్లో చేతులు కడగాలి అని ఒత్తిడి చేశాడు. బేగం కరీమాతో మాట్లాడి, హలాల్ జాగ్రత్తలు కూడా చెప్పిమరీ ‘ఠీక్ హై’ అన్నాడు షఫీ.
        కట్ చేస్తే డిన్నర్ టేబుల్ మీద ఎదురెదురు వరుసల్లో తూరా – షఫీ కుటుంబాలు. (మీద అంటే పైన అని కాదు టేబుల్ కి అటు ఇటు వరుసల్లో అని చదువుకోవాలి). టేబుల్ కి ఒక చివర మన ‘అపూర్వ సహోదరులు’ తూరా – షఫీలైతే మధ్యలో తీరా – కరీమా ఉంటే మరో చివరలో మన కథానాయకా, నాయికలు ఒలావ్, ఉమ్రావ్ లు కూర్చున్నారు. తొందరపడి మనసులో మీరొక డ్యూయెట్ వేసుకోకండి. అప్పటికి ఒలావ్ కి 13, ఉమ్రావ్కి 10, వేళ్ళు కాదు ఏళ్ళు. ఫుడ్ ఎంత బావుందో ఉమ్రావ్ మోహంలో కనపడింది మన ఒలావ్ కి. అప్పుడే ఫుట్ బాల్ మాచ్ నుంచి వచ్చినట్టున్నాడు ఒలావ్, పరశురాముడై విజృంభించాడు. ఆ సాయంత్రం ఎలాంటి అవాంఛనీయ ఉద్విగ్నభరిత సంఘటనలు లేకుండా ఒక కొలిక్కొచ్చింది. వెళుతూ వెళుతూ.. ఓ సారి మీరు కూడా భోజనానికి రావాలి ఒదిన గారు అన్నట్టు చెప్పింది కరీమా.. మొక్కుబడిగా. పాపం ఉమ్రావ్ మాత్రం అందరిలో చాలా ఒంటరిగా ఫీలయింది ఆ సాయంత్రం.
        అన్నట్టు ఉమ్రావ్ కి కూడా ఒక పిట్టకథ ఉందండి. మన షఫీ జీవితంలో యవ్వనం వెర్రి మొగ్గలేస్తున్న రోజుల్లో బాలీవుడ్ నాయకి రేఖకి వీరాభిమాని. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని మంకుపట్టు పట్టికూర్చున్నాడు. ఉమ్రావ్ జాన్ సినిమా విడుదలై వారం రోజులు. కుర్రకారంతా క్రికెట్ గ్రౌండ్ లో పోగై ఆమెపై గాసిప్పుల నిప్పులు చెరుగుతున్న రోజులు. అందునా అవి పైరసీ వీడియో క్యాసెట్లు సరిహద్దులు దాటుతున్నరోజులు. పెళ్ళీ పెటాకులు లేకుండా తిరుగుతున్న షఫీకి ముందు రోజు ఉమ్రావ్ జాన్ పైరసీ క్యాసెట్టు తెచ్చిచ్చి మర్నాడు కరీమాకి అదే గెటప్ వేయించి పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టించాడు వాళ్ళ అబ్బాజాన్. ఇంకేముంది అడ్డంగా బుక్ అయిన సంగతి మూడు రాత్రులూ గడిచాకగానీ బోధపడలేదు పురుషుడికి. మర్నాడు పేపర్లో మేకప్ లేకుండా ఉన్న రేఖ ఫోటోని చూసి వేసిన గుటకకి నోట్లో ఉన్న చూయింగ్ గమ్ గుటుక్కున లోపలికిపోయింది. అంతే మర్నాడు చూయింగ్ గమ్ తో పాటే రేఖపై మనసు కూడా పోయింది. ఎందుకో పెళ్లి ఫోటోల్లో మేకప్ తో ఉన్న కరీమానే అందంగా కనిపించసాగింది షఫీకి. కట్ చేస్తే 9 నెలల తరువాత ఒక చేతిలో బేబీ ఉమ్రావ్ ని పెట్టింది కరీమా, ఇంకో చేతిలో నార్వే వీసా పెట్టాడు పోస్ట్ మాన్. ఆనందంతో గాల్లో తేలాడు షఫీ విమానంలో.
        సహపంక్తి భోజనాల్లో చివరాఖర్లో కూర్చుని ‘ఏవండీ.. మాకింకా లడ్డూ రాలేదిక్కడ’ అని అరిచే షుగర్ పేషంట్ లాగా, టైటిల్లో చెప్పిన పలావింకా రాలేదని కంగారు పడుతున్నారా? వస్తున్నా.. తెస్తున్నా..
        ఓకే.. మన కథలో మెయిన్ ట్రాక్ కరీమా కౌంటర్ ఇన్విటేషన్ దగ్గర ఆగింది కదా. అలా పిలవగా పిలవగా ఒక ఇఫ్తారు విందుకి రాక తప్పలేదు మన తీరా-తూరాముల కుటుంబానికి. మునుపెన్నడూ ఇలాంటి అనుభవం లేని మన ఒలావ్ కి ఆ దక్షిణాసియా సుగంధ ద్రవ్యాల సువాసనకి గుమ్మంలోనే మైకం కమ్మినట్టయింది. మళ్ళీ కట్ చేస్తే టేబుల్ మీద అదే ప్యాటర్న్ లో తూరా – షఫీ ల కుటుంబాలు, కాకపొతే టేబుల్ మీద కంటెంటే మారింది. అది ఒలావ్ మీద అనుకోని ప్రభావం చూపింది. ఈసారి ఎదురుగా ఉన్న ఉమ్రావ్ ఉనికి కూడా తెలియలేదు అతగాడికి. ఇజ్నిక్ సిరామిక్ ప్లేట్లో వేడి వేడి పలావ్ వడ్డించింది కరీమా. ఆ ప్లేట్ వంక చూస్తుంటేనే ఒక ఆర్ట్ ఫార్మ్ లా అనిపించింది. ఎటు పట్టుకోవాలో? ఎటు పెట్టుకొవాలో?(నోట్లో) కూడా అర్థంకానంత అందంగా ఉన్నాయి ఆ చెంచాలు. బంగారు తీగల్లాంటి బాస్మతి రైస్, సెలయేళ్ళు ఏళ్లతరపడి కడిగి, సాన పెట్టిన సుతిమెత్తని సున్నపురాతి పిక్కల్లాంటి జీడిపప్పు, అక్కడక్కడా ఉడికిన ముత్యాల్లాంటి కిస్మిస్లు, కన్నెఎంకి ముక్కుపుడకల్లాంటి లవంగాలు, పండిన సంపంగి రేకుల్లాంటి జాపత్రి, ఎండి రాలిపడిన నక్షత్రల్లాంటి అనాసపువ్వులు, తంజావూరు తామ్ర పత్రాల్లాంటి బేయాకులు… ఇలా మెదడు వర్ణిస్తూ పోతుండగా చేతులు, నోరు వాటి పని అవి చర చరా చేసుకుపోతున్నాయి ఒలావ్ కి. అంతే సృష్టిలో ఉన్న భాషలేవీ వర్ణించలేని ఆ అనుభూతికి లోనై అక్కడే పడ్డాడు ప్రేమలో మన ఒలావ్, ఉమ్రావ్ తో కాదు పలావ్తో. నిజ్జంగా పలావ్ తోనే. ఆ తరువాత అలవాటులేని మసాలాలు కడుపులో చేసిన అల్లరికి రెండు రోజులు గృహనిర్భందం కాకతప్పలేదు. అయినా జిహ్వ జయించింది. ఎప్పుడెప్పుడు ఉమ్రావ్ వాళ్ళింటికెళదామా కరీమా చేత్తో పలావ్ వండించుకు తిందామా అని అక్కడికి ఇక్కడికి చక్కర్లు కొట్టడం మొదలెట్టాడు.
        మరి చిన్నప్పటినుండి పైరేటెడ్ సీడీల్లో బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగిని ఉమ్రావ్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలానే అర్థం చేసుకుంది. అంతే ఒలావ్ లో ‘రాహుల్’ని చూసింది, పడింది. ఐ మీన్ మనసు పడింది. ఒలావ్ ని కూడా నెట్టింది. అంతే మనవాడి పులావ్ కి ఉమ్రావ్ తోడయింది. కాలం గడుస్తోంది.
        ఈ తంతు మొత్తానికి మూల స్త్రీ అయిన కరీమాకి విషయం బోధపడటానికి అట్టే సమయం పట్టింది. ఇంట్లో ఈడుకొచ్చిన పిల్ల ఉన్న సంగతి, అలాగే తోరా ఇంట్లో జోడుకొచ్చిన పిల్లాడున్నసంగతి షఫీకి గుర్తుచేసింది. కరీమా మనసులో మాట అర్థంకానట్టు నీకేమైనా అర్థమయిందా అని తూరాని అడిగేసాడు షఫీ. తీరాకేమైనా అర్థమవుతుందేమో అడిగి చెప్తా అన్నాడు తూరా. ఈ చైను ఇలా కంటిన్యూ అయ్యేలోపు మీకసలువిషయం అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాకపొతే కథ మొదటినుంచి చదవండి. కట్ చేస్తే అహ్మదీయ సాంప్రదాయంలో గ్రోన్లాండ్ మసీదులో ఇద్దరిచేత మూడు సార్లు కుబూలించారు పెద్దలు. పాక్-పశ్చిమాల (‘పా’ కింద ‘ర’ వత్తు సైలెంట్) మేలు కలయిక అని నార్వేయంలో గొణుక్కున్నారు అతిధులు.
        మళ్ళీ కట్ చేస్తే అవే మంచురహిత క్రిస్మస్ రోజులు. పైరేటెడ్ సినిమాలు చూసే అలవాటు లేని ఒలావ్, బేగం ఉమ్రావ్ తో కలిసి క్లింగేబెర్గ్ షినోలో ‘బాజీరావ్ మస్తాని’ సినిమాకెళ్ళారు. వాళ్లింకా దియేటర్లోంచి బయటికి రాలేదు వచ్చాక చెబుతా తరువాత ఏమయిందో.

॥ అవకాశవాణి ॥

Standard

1850_933287836758388_9019207182854152328_n

అవకాశవాణి, ఓస్లో కేంద్రం. నూట మూడు పాయింట్ రెండు మెగా హెర్ట్జ్ పై తెలుగు ప్రసారాలు వింటున్నారు. ఇప్పటి వరకు మీరు ‘చలికాలం – చంటిపిల్లలు’ శీర్షికన మంచుదేశాల్లో చలికాలంలో పసిపిల్లల్లో వచ్చే శారీరిక, మానసిక ఋగ్మతలు వాటి నివారణ గురించి డా.యెన్స్ ఓలావ్ బర్గ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. శ్రోతల సౌకర్యార్థం ఈ కార్యక్రమం యొక్క podcast అవకాశవాణి అంతర్జాల ముఖపుటలో రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి అందుబాటులో ఉంటుంది.
తరువాతి కార్యక్రమం తరువాత వింటారు. ఇప్పుడు ‘నార్వీజియన్ ఉన్నత విద్య – Russ సంస్కృతి – సామాజిక పరివర్తన’ గురించి Bergen విశ్వవిద్యాలయ ఆచార్యులు, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డా.Pitch Reddy Munch Reddy గారితో ఇష్టా-గోష్టి. పాల్గొంటున్నవారు ఓస్లో విశ్వవిద్యాలయ విద్యార్థిని విద్యార్థులు.
హర్షించాలి కొన్ని తెలిసిన సామాజిక కారణాల వల్ల ప్రకటించిన కార్యక్రమం క్రమంలో వేయలేనందుకు సంతోషిస్తున్నాం. ఇప్పుడు ‘భక్తిరంజని’ శీర్షికన క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఓస్లో కాథలిక్కు ప్రార్థనా మందిరంలో మయూస్తువా శిశువనం చిన్నారులు ఆలపించిన కొన్ని భక్తి గీతాలు వింటారు.
……♩♪♫♬♩♪♫♬♩♪♫♬……..

అవకాశవాణి, ఓస్లో కేంద్రం. ఈనాటి సాయంకాలం ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మెగా హెర్ట్జ్ పై ‘ఉదయరంజని’ కార్యక్రమంతో పునః ప్రసారం ప్రారంభం. అంతవరకూ శెలవు. హాదేబ్ర.

॥ వినతి పత్రం ॥

Standard

barber

గౌరవప్రియమైన బార్బరు బాబు గారికి, వచ్చే శనివారం నిర్ణయింపబడిన, తమరి పవిత్రమైన చేతుల మీదగా నిర్వహింపబడే నా ద్వైమాసిక క్షవర కార్యక్రమాన్ని పురస్కరించుకుని.. పూర్వానుభవం వలన కలిగిన అపూర్వమైన భయంతో కూడిన.. నా భవిష్యత్ పరువుపై గల బాధ్యతతో కలిగిన ముందుచూపుతో మీకు సమర్పించు వినతి పత్రం.
సరిగ్గా రెండు నెలల క్రితం నా తలపై మీ కత్తెర చేసిన అల్లరి తాలూకు చిటపటలు ఇప్పటికీ నా చెవుల్లో తౌజండ్ వాలాలో సీమటపాకాయల్లా మార్మోగుతూనేవున్నాయి. వచ్చిన ప్రతిసారీ ‘ఈ సారి మీరు ఎలాంటి స్టైలు కోరుకుంటున్నారు?’ అని తమరు సౌమ్యంగా నార్వేయంలో అడగటం, తెలుగునుంచి ఆంగ్లీకరించిన నార్వేయంలో తడి కళ్ళతో, పొడి పొడి మాటలకు నా సంజ్ఞలు జోడించి దశాబ్దాలుగా ఔపోసన పట్టిన నా శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని నా కోరికల చిట్టా పూర్తిగా విప్పకముందే మీరు అంతా అర్థమైందన్నట్టు ‘ఓకే.. ఓకే’ అంటూ ముందుకు దూసుకుపోవడం, కళ్ళు మూసి తెరిచేలోపే తలపై జుట్టంతా చుట్టూ చెల్లాచెదురు అయిపోవటం, ఎదురుగా అద్దంలో ఇప్పటివరకు ఉన్న మనిషి అకస్మాత్తుగా మాయమవటం నాకు షరా మామూలైపోయింది. పైగా చివరలో ఓ అద్దం తెచ్చి నా వెనుక అన్ని కోణాల్లో చుట్టూ తిప్పుతూ మీరు ‘హవీజిట్..? హవీజిట్..?’ అంటుంటే నాకు నా హెయిర్ స్టైల్లో ‘హెయిర్’ ‘వేరీజిట్..? వేరీజిట్..?’ అన్నట్టు వినిపిస్తుంటుంది. మీ పుణ్యమా అని సెలూన్ కి వచ్చిన ప్రతిసారి మా ఇంటికి ఒక కొత్తదారి కనిపెట్టవలసి వస్తుంది. ఎలాగోలా ఇల్లుచేరితే ఇల్లాలు నాలుగు సెక్యూరిటీ క్వశ్చన్స్(అందులో మా ఎంగేజ్మెంట్ డేట్ ఒకటి) అడిగిగానీ ఇంట్లోకి రానివ్వటంలేదు. ఇహ మా చంటోడైతే కనీసం వారం రోజులు నా దెగ్గిరికి రాలేదంటే మీరు నమ్మరు. ముందుచూపుతో పరువు కోసం ఆ వారం రోజులు ఆఫీసుకి శెలవు పెట్టవలసి వచ్చింది. వచ్చే క్రిస్మస్ శెలవల buffer time దృష్టిలో ఉంచుకుని ఈ విడిత ప్లాన్ చేయడం జరిగింది.

శిశిరంలోనే ఆకులు రాలటం అనేది జగమెరిగిన సత్యం. కాని తలపై జుట్టుకు మాత్రం 365 రోజులూ శిశిరమే అన్న విషయం కేవలం నార్వే యెరిగిన సత్యం. అందుకే నాకు తలసరి వెంట్రుక ఖర్చు(maintenance cost per hair) పెరిగిపోతోందని మనవి. ఇక్కడి ఒక తడవ క్షవరం ఖర్చుతో స్వదేశంలో కనీసం 2 సంవత్సరాల క్షవరం బడ్జెట్ (అదనపు సేవలతో కలిపి) వేయవచ్చు. అందుకే నార్వేలో ధనవంతులంతా బార్బర్లైనా కావచ్చు లేదా బట్టతల గలవాళ్ళయినా కావచ్చునని నా అభిప్రాయం. మరి మీరేమో బట్టతల బార్బరు. ఈ ఆర్ధిక మాంద్యంలో మీ ఆర్ధికస్థితి గురించి ఆలోచిస్తే అసూయగా ఉంది.

చివరగా నా భవిష్యత్ పరువు, మర్యాద, గౌరవ, సుఖ శాంతులు ఈ శనివారం తరువాత ఒక కొత్త అధ్యాయంలోకి, కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయి. వాటికి మీ పూర్తి సహాయ సహకారాలుండాలని ఈ నా వినతి.